షడ్రసముల గురించి వివరణ
షడ్రసములు అనగా 6 రకాల రుచులు . ఈ ఆరురకాల రుచులు మన ఆహారములో భాగములై ఉన్నవి . ఇప్పుడు మీకు ఒక్కోరసము యొక్క ప్రాధాన్యత వాటి గుణాలు మరియు అతిసేవనం వలన కలుగు దుష్ప్రభావాల గురించి సంపూర్ణముగా వివరించెదను .
* మధుర రసము గుణము –
మానవశరీరమునకు పుట్టుక నుండి మధురరసము కలగలసిపోయినది . ముందుగా తల్లిపాలు మధురంగా ఉండి త్వరగా జీర్ణం అగును . అదియే పుట్టిన బిడ్డకు ప్రాధమిక ఆహారము . ఇది ఓజోవర్ధకము అనగా రోగనిరోధకశక్తిని పెంచునది అని అర్ధము . మధురరసము సర్వ ధాతువృద్ధిని కలిగించును . శరీరముకు బలము మరియు మంచి రంగును ప్రసాదించును .దీర్గాయువుని ఇచ్చును . మనస్సుతో పాటు పంచేంద్రియాలకు ఆనందాన్ని కలిగించును . వాతాన్ని మరియు పిత్తాన్ని హరించును . విషాన్ని హరించును . దప్పికను పోగొట్టును . చర్మమును స్నిగ్ధపరుచును . వెంట్రుకలను పెంచును . కంఠస్వరం బాగు చేయును . అభిఘాతము ( దెబ్బలు ) నందు , శరీరము శుష్కించినప్పుడు ఇది మంచి రసాయనంగా పనిచేయును .
దీనిని అతిగా ఉపయోగించిన అతిస్నిగ్థత ( శరీరం జిడ్డు పట్టుట ) , సోమరితనం , శరీరము బరువు పెరుగుట , అతినిద్ర , శ్వాసము , కాసము మొదలైన వాటిని కలిగించి గ్రంథి , బోధ మున్నగు కఫవ్యాధులను కలిగించును .
* ఆమ్ల రసము గుణము –
ఆమ్లరసము నాలుకకు తగిలిన వెంటనే నోటివెంట అధికంగా నీరుకారి దంతములు పీకునట్లు అగును . ఇది ఆకలిని వృద్ధిచేయును . ధాతువృద్ది చేసి మనస్సుకు ఉత్సాహం ఇచ్చును . ఇంద్రియాలకు బలమును ఇచ్చును . తృప్తిని కలిగించును . ఆహారమునకు స్నిగ్ధత కలిగించి జీర్ణం అగుటకు సహాయం చేయును .
దీనిని మితిమీరి ఉపయోగించిన పిత్తమును వృద్ధిచేసి రక్తమును దోషము చెందించి విద్రది , వ్రణములను పక్వము చేయును . శరీర అవయవాలను శైధిల్యం చెందించి శోధము , కంఠము నందు మంట , రొమ్ము , హృదయము ల యందు ఇబ్బందులను కలుగచేయును .
* లవణ రసము గుణము –
ఇది రుచిని కలుగచేయును . ఆకలిని పుట్టించును . జీర్ణమగును . వాతాన్ని నిరోధిచుటను పోగొట్టును . ఉష్ణతత్వము కలిగి ఉండును .
దీనిని అధికంగా సేవించిన పిత్తము ప్రకోపించి దప్పిక , మంట , కన్నీటిని కలిగించుటయే కాక శరీర మాంసం చెడగొట్టి కుష్ఠు వ్యాధి కలిగించును . ఇది శరీరము నందు విషమును వృద్దిచేయును . వ్రణములను పగులునట్లు చేయును . దంతములు కదులున్నట్లు చేయును . పుంసత్వము పోగొట్టును . ఇంద్రియశక్తిని తగ్గించును . శరీరకాంతిని పోగొట్టును . వెంట్రుకలు నెరియుట , బట్టతల , చర్మము నందు ముడతలు , రక్తపిత్తము , చర్మముపైన పొక్కులు వంటి సమస్యలు కలుగచేయును .
కటు( కారము ) రసము గుణము –
కటు రసము నాలుకకు తగిలినంత మాత్రమే ముక్కును కార్చును . యావత్ శరీరం కంపించును . దీనిని స్వల్పమోతాదులో ఉపయోగించినచో కొన్ని సద్గుణాలు కలవు . ముఖశుద్ధి చేయును . జఠరాగ్ని పెంపొందించును . ఆహారమును శుష్కిoపచేయును . కన్నీరు వచ్చునట్లు చేయును . కఫ సంబంధ జిగురు పోగొట్టును . శరీరవృద్ధి ( శరీరపు లావు ) తగ్గించును . క్రిములను హరించును . వ్రణములు పగులునట్లు చేయును . శ్రోతో నిరోధము ( శరీరం నుండి బయటకి వ్యర్ధాలు వెడలు మార్గములు ) పొగొట్టి విశాలము చేయును .
అధికంగా సేవించిన శుక్రము నశించును . మైకము కమ్మును . తల తిరుగును . కంఠము నందు , శరీరము నందు మంటలు పుట్టును . దప్పిక పుట్టి బలము నశించును . వాతరోగములు పుట్టుటకు కారణం అగును .
* తిక్త ( చేదు ) రసము గుణము –
తిక్తరసము నాలుకకు తగిలినవెంటనే కంఠము నందు లాగుచున్నట్లు అనిపించును . ముఖము నందలి ( నోటియందలి ) జిగురు పోగొట్టి రోమాంచనం ( వెంట్రుకలు నిక్కబొడుచుకొనునట్లు ) కలుగచేయును . చేదు నాలుకకు రుచిగా అనిపించకున్నను నోటి యందలి అరుచిని పోగొట్టి ద్రవ్యములను రుచిగా ఉండునట్లు చేయును . శారీరక విషాలను హరించును . జ్వరములను హరించును . కుష్ఠు రోగము నందు ఉపయుక్తము . క్రిమి నాశకము , స్తన్యమును శుద్ధిచేయును . మాంసమును దృఢపరచును . జీర్ణకారి . శరీరం నందు ఎచ్చటి నుండి ఐనా జలం వంటి పదార్థము వెడలుచున్న దానిని ఆపును . శరీరపు కొవ్వు , మజ్జి , వ్రణములు నుండి కారు రసి , చీము , మూత్రము వంటి జల సంబంధమైన వాటిని ఎండించును .
దీనిని అతిగా ఉపయోగించిన ధాతువులన్నినింటిని నాశనం చేయును , శరీరం నందు గరుకుతనం కలిగించును . బలం తగ్గును శరీరం కృశించును . వాతరోగములు పెరుగును .
* కషాయ( వగరు ) రసము గుణము –
కషాయ రసము నాలుకకు తగిలింత వెంటనే నోరు ఎండిపోయి నాలిక స్థంభించును . కంఠమును బంధించును . హృదయమును పట్టి లాగి సంకోచింపచేయును . గుండెని ఒత్తునట్టు బాధ కలుగచేయును .
ఈ వగరు రసము స్వల్పప్రమాణములో భుజించిన సద్గుణములు కలవు . కఫ, రక్త , పిత్త వికారముల యందు ఉపయుక్తము . శరీరద్రవాలను ఆర్చును . వ్రణములను పగలగొట్టును .
దీనిని అతిగా సేవించుట వలన నోటి రోగములు కలుగును . హృదయము నందు బాధ కలిగించును . ఉదరము ఉబ్బునట్లు చేయును . మలమూత్రములు వంటి వ్యర్ధాలను బయటకు పంపు మార్గాలను బంధించి శరీరముకు నలుపు తెచ్చును . శుక్రమును నాశనం చేయును ఆర్థిత వాతము , పక్షవాతము వంటి వాతరోగములను కలుగచేయును .
కావున ప్రతి రసమును మన ఆహారములో భాగము అయ్యేలా చూసుకొన్నచో మన శరీరము ఎల్లప్పుడూ ఆరోగ్యకరంగా ఉంటుంది.
ఆదిత్య హృదయంధ్యానంనమస్సవిత్రే జగదేక చక్షుసేజగత్ప్రసూతి స్థితి నాశహేతవేత్రయీమయాయ త్రిగుణాత్మ ధారిణేవిరించి నారాయణ శంకరాత్మనేతతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితమ్ ।రావణం…
ఓం ప్రకృత్యై నమఃఓం వికృత్యై నమఃఓం విద్యాయై నమఃఓం సర్వభూతహితప్రదాయై నమఃఓం శ్రద్ధాయై నమఃఓం విభూత్యై నమఃఓం సురభ్యై నమఃఓం…
ఆరా షీత్ - దాని 7 పొరలు - విశ్లేషణ(Aura Sheath and it's 7 layers)✒️ భట్టాచార్య మానవ…
ఆయుర్వేద వైద్యులు మరియు పరిశోధకుల వద్ద ఉండవలసిన ఆయుర్వేద గ్రంధాలు - ఆయుర్వేద ప్రశస్తి . - 1986 .ఆంగ్ల…
*యంత్రము, మంత్రము, తంత్రము.* హిందూధర్మం ఒక గొప్ప విశిష్టమైన మతం. ఈ ధర్మనుసారం, లోకంలోని సర్వశక్తులు ఆదిశక్తి…
🙏పాత అలవాట్లు 👇ఒకప్పుడు మూఢనమ్మకము, శాస్త్రీయం కాదు అనే, అనేక అంశాలు సైంటిఫిక్ గా నిరూపించబడ్డాయి. ఉదాః కి దక్షిణము…